ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్.. షిండే గూటికి నేడు ఆరుగురు శివసేన ఎంపీలు!

  • ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునే వ్యూహం
  • నిధుల కొరత, నేతల విమర్శల వల్లే పార్టీ వీడుతున్నట్లు ప్రకటన
  • నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో షిండే వర్గంలో విలీనం
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉద్ధవ్ థాకరే అత్యవసర సమావేశం
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి లోక్‌సభలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఉన్న మొత్తం 9 మంది ఎంపీలలో ఆరుగురు సభ్యులు అధికార ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరడానికి సిద్ధమయ్యారు. 

'ఆపరేషన్ టైగర్' పేరుతో కొన్ని రోజులుగా సాగుతున్న ఈ రహస్య రాజకీయ వ్యూహం నేటి (జూన్ 22) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో అధికారికంగా కార్యరూపం దాల్చనుంది. తిరుగుబాటు ఎంపీలైన సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, భావూసాహెబ్ వాక్‌చౌరే, నగేష్ పాటిల్ అస్తికార్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్‌లు ఇప్పటికే ఉద్ధవ్ వర్గం నిర్వహించిన పార్లమెంటరీ సమావేశానికి గైర్హాజరై తమ అసమ్మతిని స్పష్టం చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండేందుకు అవసరమైన కచ్చితమైన మూడింట రెండు వంతుల మెజారిటీని ఈ తిరుగుబాటు వర్గం సాధించడం గమనార్హం.

ఈ తిరుగుబాటుపై ఇప్పటికే ఎంపీలు అస్తికార్, నింబాల్కర్ బహిరంగంగా ప్రకటనలు చేశారు. గత రెండేళ్లుగా తమ నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు అందకపోవడం, పార్టీలోని కొందరు సీనియర్ నేతలు తమపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే తాము ఉద్ధవ్ వర్గాన్ని వీడాల్సి వస్తోందని వారు స్పష్టం చేశారు. తాము కేవలం ఒక శివసేన గ్రూప్ నుంచి అసలైన సిద్ధాంతాలు కలిగిన మరో శివసేనలోకి మారుతున్నామని వారు సమర్థించుకున్నారు. 

ఈ పరిణామాలపై మహారాష్ట్ర  సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ.. 'ఆపరేషన్ టైగర్' నూటికి నూరు శాతం విజయవంతమైందని, త్వరలోనే ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తిరుగుబాటు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరేందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షిండే వర్గం విడుదల చేయనుంది.

మరోవైపు ఈ భారీ విలీన ప్రక్రియ ఉద్ధవ్ థాకరే క్యాంప్‌లో కలకలం రేపింది. పార్టీ మారిన వారిని ఉద్ధవ్ థాకరే ‘ద్రోహులు’గా అభివర్ణించారు. అధికార దాహం, డబ్బు కోసమే ప్రజలు ఇచ్చిన తీర్పును వీరు అగౌరవపరిచారని ఆయన మండిపడ్డారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, మిగిలిన ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా చూసేందుకు ఉద్ధవ్ థాకరే నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు నారిమన్ పాయింట్‌లోని ‘శివాలయ’ కార్యాలయంలో శివసేన (యూబీటీ) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Uddhav Thackeray
Eknath Shinde
Shiv Sena UBT
Maharashtra Politics
Operation Tiger
Lok Sabha MPs defection

More Telugu News